తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత నిండు కుండా, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలం. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ గుర్తుగా వాడుతారనడానికి ఈ బొమ్మ ఒక ఆధారం
భారతదేశం ఎటువంటి ఊడఁడ లేకుండా రెండువేల పైనాటినుండే తెలుగు మాట్లాడ్తున్నట్టుగా తెలియజేయబడింది, 2011 జనాభా లెక్కబట్టి దాదాపు 8.2 కోట్ల మందికి పైగ ఇప్పుడు మాట్లాడేవారున్నారు.[9] భారతదేశంలో మాతృభాషగా తెలుగు నాలుగో స్థానంలో ఉండగా, ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది.[10][11] ఇదిద్రావిడభాషా కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే భాష. భారతదేశంలోఇరవైరెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి.[12] ఇదిఅమెరికాలో వేగంగా పెంపొందుతున్న భాష.[13] తెలుగు భాషలో సుమారు 10,000 పాత శాసనాలు ఉన్నాయి.[14] కన్నడిగుడైనశ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషని 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగిడారు.
తెలుగు మాట్లాడేవారినితెలుగువారు అని అంటారు.[15] తెలుగు పాత రూపాలుతెనుంగు,తెనుగు,తెలుంగు.[16] తెలుగు ద్రావిడభాషే గాక తెన్ (దక్షిణం) అనే మాట నుండి తెనుగు, దీని నుండి తెలుగు వచ్చాయని, భాషాశాస్త్రవేత్తలు నిర్ణయించారు, 13వ శతాబ్దంలో అథర్వణాచార్యుడు తెలుగు వ్యాకరణాన్నిత్రిలింగ శబ్దానుశాసన (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు.[17] 17వ శతాబ్దానికి చెందినఅప్పకవి త్రిలింగ నుండితెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడుచార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు.[18]
జార్జ్ అబ్రహం గ్రియర్‌సన్, ఇతర భాషావేత్తలు ఈ వ్యుత్పత్తిపై సందేహం వ్యక్తం చేశారు.తెలుగు పాత పదం.త్రిలింగ దానికి సంస్కృతీకరణ[19] అయితే, ట్రిగ్లిఫమ్,త్రిలింగం,మోడోగలింగం పురాతన గ్రీకు మూలాల్లో ధృవీకరించబడినందున, ఈ వ్యుత్పత్తి చాలా పురాతనమైనది అయి ఉండాలి, వీటిలో చివరిది "త్రిలింగ " యొక్క తెలుగుఅనువాదంగా అర్థం చేసుకోవచ్చు.[20]
మరొక కథనం ప్రకారంతెనుగు అనేది ప్రోటో-ద్రావిడ పదం*తెన్ ("దక్షిణం")[21] నుండి "దక్షిణం/దక్షిణ దిశలో నివసించిన ప్రజలు" నుండి కలిగినది. తెలుగు అనే పేరు "న" నుండి "ల" మార్పు వలన వచ్చింది.[22][23]
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
భాషా శాస్త్రకారులు తెలుగునుద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా గుర్తించారు.[24] అనగా తెలుగు –హిందీ,సంస్కృతం,లాటిను,గ్రీకు మొదలైన భాషలు గల ఇండో-యురోపియన్ నుడుల గుంపుకు చెందకుండా,తమిళము,కన్నడం,మలయాళం,తోడ,తుళు,బ్రహూయి,గోండి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ నుడుల గుంపుకు చెందినదిగా భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'దక్షిణ మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటుగోండి, కుయి,కోయ,కొలామి కూడా ఉన్నాయి.[25] సా.శ. 940 ప్రాంతంలోపంపన కాలంలోనే తెలుగు భాష ఒక నిండైన సాహిత్యం కలిగిన భాషగా వ్రాతల రూపంలో మనకు కనిపించిందని పరిశోధనల్లో తేలింది.[26] సామాన్యశకం 1100–1400 మధ్య పాత తెలుగు- కన్నడ లిపి నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు పుట్టినాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది.[27]
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నుడులతో పాటుగా మొత్తం 26 నుడులు నేడు వాడుకలో ఉన్న ద్రావిడ నుడులు. నాటిసింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి చెందినవారైనందున[28] వారి భాష కూడా ద్రావిడనుడే, లేదా ద్రావిడ నుడులకు చెందినది అయివుంటుందని వారి నమ్మకం.
ఎన్నో ఇతర ద్రావిడ నడులవలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు వ్రాత అయిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి.
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర సామాన్య శక పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనం సామాన్య శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందింది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం "నాగబు". సామాన్య శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడిందిగా గమనించవచ్చు.
ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు గ్రంథ ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడింది.:[29]
పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికిపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
"అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ,అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు".
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. వీటి మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.[30] సా.శ.పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాతబౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సా.శ..పూ. 4వ శతాబ్దిలోమెగస్తనీసు అనేగ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులని అవి క్రమంగా మిళితమైనవనీ కొందరి అభిప్రాయం.[31] అయితే ఈ అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగుగోదావరి,కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడుఅల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.[32]
సా.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి "తెలుంగు భూపాలురు", "తెల్గరమారి", "తెలింగకులకాల", 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలంనాటికి తెలుగు రూపాంతరంగా "తెనుగు" అనే పదం వచ్చింది. 13వ శతాబ్దంలోమహమ్మదీయ చారిత్రకులు ఈ దేశాన్ని "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దం పూర్వభాగంలోవిన్నకోట పెద్దన్న తనకావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం,కాళేశ్వరం,ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామం పొందిందని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయమహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు.[33] 12వ శతాబ్దిలోపాల్కురికి సోమనాథుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకు, జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకొన్నాయి.
తెలుగుఆంధ్రప్రదేశ్,తెలంగాణ,పుదుచ్చేరిలోనియానాంలో అధికార భాష.పశ్చిమ బెంగాల్,అండమాన్ నికోబార్ దీవులు లలో అదనపు అధికార భాషగా గుర్తించబడింది. ఇంకాతమిళనాడులో తెలుగు మాట్లాడుతారు. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగేకర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా,ఒడిశా,ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.[34]
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డి కాంటి తెలుగునిఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ౠ
ఌ
ౡ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
అం
అః
/a/
/ɑː/
/ɪ/
/iː/
/u/
/uː/
/ru/
/ruː/
/lu/
/luː/
/e/
/eː/
/ai/
/o/
/oː/
/au/
/am/
/aha/
తెలుగు భాషను సాధారణంగా ఒకపదంతో మరొకపదం కలిసిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులోకర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
సాగరాంధ్ర లేదా [[కోస్తా మాండలిక భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు.
రాయలసీమ భాష:కడప, కర్నూలు,చిత్తూరు,అనంతపురం ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అని అంటారు.
తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషనుతెలంగాణ మాండలికం అని అంటారు.
[[కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను[[ కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీనబ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది.అశోకుని కాలంలోమౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్నశాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలుమూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైనభట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ భాష "హలెగన్నడ" లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది.[25]
తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.
తెలుగు లిపి చాలవరకు ఉచ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్), "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారం మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికి, చదవడానికి, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చు అంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్న సంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, ఇండో అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.
తెలుగు భాష అక్షరాలకుయూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.[35]
1985లో డిటిపి కొరకు ఆపిల్ కంప్యూటర్ విడుదలయ్యింది. తొలుత ఆంగ్ల భాషకే మాత్రమే పరిమితమైనా తరువాత భారతీయ భాషలకు విస్తరించాయి. చెన్నైకి చెందిన ఉమా కళ్యాణరామన్ అనే మహిళ తెలుగు ఖతి (ఫాంటు) ని రూపొందించింది. ఆ తరువాత కృష్ణ, గోదావరి అనే ఖతులు వాడకంలోకి వచ్చాయి. 1998 లో సిడాక్ భారతీయభాషల తోడ్పాటుకు పర్సనల్ కంప్యూటర్ కు జిస్ట్ కార్డు విడుదలచేయటం ఆ తరువాత సిడాక్ లీప్, లీప్ ఆఫీస్, ఐలీప్, వివిధ భాషల ఖతులు విడుదలచేసింది. 2001 లోపోతన (ఫాంటు) స్వేచ్ఛానకలుహక్కులతతిరుమలకృష్ణ దేశికాచారి విడుదలచేశాడు. ఆ తరువాత అన్ని కంప్యూటర్ వ్యవస్థలకు,తెలుగుతోడ్పాటు అందుబాటులోకి వచ్చింది.[36] 2011 ప్రాంతంలో తొలి స్మార్ట్ ఫోన్లలో తెలుగు వాడకం వీలైంది.
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించినమహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తితెలుగు శాసనం. ఇదికడప జిల్లాకమలాపురం తాలూకాఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందినఅమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.
దీనినినన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకునారాయణ భట్టు సహాయంగా నిలిచాడు.నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారే.
నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.తిక్కన (13వ శతాబ్ది),ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తిశ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తనఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైనఅష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో,షెల్లీ,కీట్స్,వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు
నన్నయకు పూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20వ శతాబ్దము తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి.[37] గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.
↑Sekaram, Kandavalli Balendu (1973),The Andhras through the ages, Sri Saraswati Book Depot, p. 4,The easier and more ancient "Telugu" appears to have been converted here into the impressive Sanskrit word Trilinga, and making use of its enormous prestige as the classical language, the theory was put forth that the word Trilinga is the mother and not the child.